సీతమ్మ మాయమ్మ... మా తండ్రి రామయ్య

శ్రీరామ నవమి స్పెషల్రాముడంటే కమ్మటి వడపప్పు. సీతమ్మవారంటే తియ్యటిబెల్లం పానకం. వడపప్పు పానకం కలిస్తేనే సీతారామకళ్యాణం. ఇద్దరూ కలిస్తేనే మన ఊరి కోవెల్లో రామనవమి సంబరం. వీరిద్దరి అనుబంధమే మన ఇంటి ద్వారబంధానికి పచ్చని మామిడాకుల తోరణం. సీతారాములంటే వేరెవరో కాదు. మన ఆప్తులు. మన ఆత్మబంధువులు. అదే మన భావన. అందుకే రామాయణంలో ఆ జంట హాయిగా నవ్వినప్పుడల్లా మనం ఆనందపడతాం. దుఃఖిస్తున్నప్పుడు కళ్లనీళ్లు పెట్టుకుంటాం. ఏళ్లు గడవొచ్చు. యుగాలు మారిపోవచ్చు. కానీ రామకథకు తిరుగుండదు. సీతమ్మ పాతివ్రత్యానికి కళంకం అంటదు. ఇద్దరూ ఇద్దరే. ధర్మస్వరూపులు. రామచంద్రుడు, జానకమ్మ ఒకరికోసం ఒకరు పుట్టారనడం కంటే, ఇరువురూ కలిసి మానవజాతికోసం పుట్టారనడం సబబు. ఆచంద్రతారార్కం నిలిచిపోయే విలువలను ఆచరణలో చూపించిన పుణ్యదంపతులు. మన్వంతరాలు ఎన్నయినా మలిగిపోనీండి. మన బామ్మ రామకోటి రాయడం మానుకోదు. మన మనవడికి రాముడి పేరు పెట్టడం మరిచిపోం. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ... పాట కోదండరామయ్య వివాహగీతంగా మైక్‌సెట్లలో వినిపించక మానదు. అదే సీతారాములవైభవం. అదే సీతారాముల వైశిష్ట్యం. అందుకే ఈ శ్రీరామనవమి సందర్భంగా వీరి దివ్యగాథలు...

రామయ్య తండ్రి
శ్రీరామచంద్రుడు
జన్మస్థలం : అయోధ్య
జనన కాలం : త్రేతాయుగం
వంశం : ఇక్ష్వాకువంశం (కకుత్‌స్థ వంశం, రఘువంశం)
తల్లిదండ్రులు : కౌసల్య, దశరథమహారాజు
సోదరులు : లక్ష్మణభరతశతృఘు్నలు
భార్య : సీతాదేవి
మామగారు : మిధిలానగరాధీశుడు జనకుడు
గురువులు : విశ్వామిత్రుడు. వశిష్టుడు..

రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. ధర్మాన్ని ఒక మూర్తిగా చేసి నిలిపితే అది రామునిగా దర్శనమిస్తుంది. ఈ మాట అన్నది వశిష్టుడు కాదు. విభీషణుడు కాదు. ఆంజనేయుడు అంతకన్నా కాదు. మరెవరన్నారు. మారీచుడన్నాడు. రాక్షసుడై ఉండీ దాశరథి గొప్పతనాన్ని గ్రహించగలిగాడు. అలా గ్రహించడమే కాదు. రావణునికీ ఈ విషయాన్ని చెప్పి చూశాడు. మూర్ఖుడైన దశగ్రీవుణ్ణి మంచిదారికి తేలేకపోయాడు. లేడి వేషంలోకి మారి రామబాణానికి ప్రాణాలొదిలాడు. శత్రు పక్షంలో ఉన్నవారు సైతం కీర్తించే సుగుణవంతుడు గనుకే రాముడు మహనీయుడయ్యాడు. మాననీయుడయ్యాడు.

బాల్యావస్థలో బుజ్జి రాముడు బుడిబుడి అడుగులేస్తూ తండ్రిని ఒక కోరిక కోరుతాడు. గగనవీధుల్లోని చందమామను చూపించి తనకది కావాలంటాడు. బహుశా రామచంద్రప్రభువు జీవితంలో ఎవర్నయినా ఏదయినా అడిగాడంటే అదే మొదటిది కావచ్చు. అదే చివరిదీ కావచ్చు. ఆ తర్వాత ఎవరేం చెప్పినా చేయడమూ, ధర్మాన్ని కాపాడటమే కానీ ఆయనకంటూ ప్రత్యేకమైన కోరికలేమీ పెంచుకోలేదు. ఆ మాటకొస్తే ఆయన తన కోసం బతికిందే లేదు! ఎంతసేపూ ధర్మం. ధర్మం. ఇదే ధ్యాస. ఇదే శ్వాస.

అయోధ్యా నగరానికి విచ్చేసిన విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రఘురాముణ్ణి తనతో పంపమంటాడు. దశరథుడి గుండెలు గుభేలుమంటాయి. బాధపడుతూనే సరే అంటాడు. అలా మునితో రాముడు కానలకు వెళతాడు. అక్కడ ఆ తాపసి సంహరించమంటేనే రాక్షసులను వధిస్తాడు. స్త్రీ అయిన తాటకను చంపడం తప్పు కాదా అని రుషులను ప్రశ్నిస్తాడు.

జవాబు రాబట్టాకనే బాణం ఎక్కుపెడతాడు. అంతటి రుజువర్తనుడు రాముడు. విశ్వామిత్రుడు వెంట రాగా సీతాస్వయంవరానికి తరలివెళతాడు. అక్కడ ఆయన చెప్పినట్టుగానే శివధనుర్భంగం చేస్తాడు. మైథిలిని పాణిగ్రహణంచేసుకోమంటూ అక్కడి నిండు సభలో జనకమహారాజు కోరగానే ఎగిరి గంతేయడు. సరేసరే అనబోడు. తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నాకనే కళ్యాణకంకణం ధరించగలనంటాడు. జన్మనిచ్చినవారికి అంతటి గౌరవం కల్పించిన వాడు కౌసల్యాసుతుడు.

రాముడికి ఎదురైనన్ని అవరోధాలు జీవితంలో మరెవరికీ తారసపడవేమో. బాసికాలతో, మధుపర్కాలతో పెళ్లిమంటపంలో కళకళ్లాడుతుండగానే పరశురాముడు పరుగులమీద వచ్చేస్తాడు. ఈ పరిణామానికి అక్కడివారంతా బెంబేలుపడతారు. శివధనువు విరవడంకాదు.. ఈ విష్ణు చాపాన్ని ఎత్తిపట్టు.. అంటూ ఆ పెద్దాయన హుంకరిస్తాడు.

ఆ సమయంలో రాముడు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తాడు. వయసులో చిన్నవాడయినా పెద్దమనసుతో మెలుగుతాడు. భార్గవుడు మాటతూలాడని తను తూలడు. నిమ్మళంగా ఉంటాడు. నిమానుగా మాట్లాడతాడు. పరశురామునికి వందనాలు చెల్లిస్తాడు. ఆనక విష్ణుధనువును అవలీలగా సారించి బలాన్ని చూపుతాడు. పెద్దల ఆశీస్సులు పొందుతాడు.

వివాహమయ్యాకయినా రాముడు సుఖపడ్డాడా అంటే అదేం లేదు. ఆ తర్వాతా వనవాసమే. నిజానికి ఇదంతా ఆయన కోరి చేసుకున్నది కాదు. తాను రాజు కావాలని రామయ్యతండ్రి ఎన్నడూ కాంక్షించలేదు. తండ్రే కోరి వచ్చి మరీ... రేపే పట్టాభిషేకం అంటాడు. జ్యేష్టపుత్రునిగా రాముడు అంగీకరిస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజునుంచి కైకేయి కోరరాని వరాలేవో కోరిందని తెలుసుకుంటాడు. అయినా ఆగ్రహించడు.

కైకమ్మను ఎన్నడూ పినతల్లిగా ఆయన భావిస్తే కదా. కన్నతల్లితో సమానంగానే సంభావిస్తాడు. అందుకే స్వయంగా ఆమె దగ్గరకే వెళ్లి ఏం చేయమంటారో చెప్పండంటాడు. తండ్రి మాటలుగా వనవాసం గురించి ఆమె చెబుతుంది. రాముడు మారు మాట్లాడడు. రేపు కిరీటం ధరించబోయేవాడు అదే ముహూర్తానికి అడవులు పట్టిపోవాల్సి రావడం ఎంతటి వైచిత్రి. అయితే సీతాపతి మాత్రం వేరే ఆలోచనే చేయకుండా పితృవాక్యాన్ని పాలిస్తాడు.

ఇక్కడ పితృవాక్య పాలన అంటే తండ్రి చెప్పినట్టుగా తను నడవడం సరే. కైకేయికి ఇచ్చిన మాటమీద తండ్రి నిలబడేలా తను చేయడమే అసలు కార్యం. అలా జన్మనిచ్చిన దశరథుడి మర్యాద కాపాడతాడు. మానవేతిహాసం మొత్తమంతా వెతికినా ఇంతటి ధర్మపరాయణుడు, ప్రియభాషి మరెక్కడా అగుపించడు.

వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి రాముడు వెళుతున్నప్పుడు ముందుగా గిరిరాజు గుహుడు ఎదురుపడతాడు. నారబట్టల్లో ఉన్న రామయ్యను చూసి కన్నీరొలికిస్తాడు. తన రాజ్యం తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. రాజ్యం కావాలంటే అయోధ్యలోనే ఉందును.. ఇంతదూరం రాను.. మమ్మల్ని క్షేమంగా నదిదాటించు అంతే చాలు.. అంటాడు నీలమేఘశ్యాముడు. ఎంతటి ధర్మజ్ఞుడో చూడండి. గుహుడి నుంచి రామలక్ష్మణులు ఏం కోరారో తెలుసుకుంటే ఎంతటి పాషాణహృదయులైనా కన్నీటి సంద్రంలో మునిగిపోతారు. రాకుమారులిద్దరూ మర్రిచెట్టు పాలు అడిగి తీసుకుంటారు!

ఆ పాలను వత్తుగా జుత్తుకు రాసుకుని వనవాసంలో కేశపాశాల ఇబ్బంది లేకుండా జడలు కట్టుకుంటారు. మహరాజు బిడ్డలు మర్రిపాలు నెత్తికి రాసుకుంటుంటే గుహుడు మంటికి మింటికీ ఏకధారగా ఏడుస్తాడు. రాముడు సముదాయిస్తాడు. అందుకే ఆయన దొడ్డమనిషి.వాలిసుగ్రీవుల యుద్ధం పరిసమాప్తమవుతుంది.కిష్కింధప్రభువుగా సుగ్రీవునికి పట్టాభిషేకం జరుగుతుంది.

తనకెంతో మేలు చేసిన రామలక్ష్మణులను ఆ కపిరాజు అంతఃపురంలో ఉండమంటాడు. శ్రీరాముడు ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తాడు. తను చేయాల్సింది వనవాసం. పల్లెల్లో గానీ పట్టణాల్లో గానీ ఉండకూడదనేది నిబంధన. కిష్కింధలో ఉంటే అరణ్యవాసానికి విఘాతం కలుగుతుంది. కాబట్టి సుగ్రీవుని రాజ్యం పరిధి దాటేసి చలికి వణుకుతూ ప్రశ్రవణగిరి శిఖరాలమీద కొన్ని నెలలపాటు కాలక్షేపం చేస్తాడు. అంతటి విలువలున్నమనిషి ఆయన.

అప్పటికింకా సేతు బంధనం జరగదు. రావణుడిమీద బాణం ఎక్కుపెట్టిందీ లేదు. ఇంతలోనే విభీషణుడు లంకనుంచి శరణుశరణు అంటూ వచ్చి రాముని చరణాలను ఆశ్రయిస్తాడు. వెంటనే రామచంద్రుడు అతగాడి శిరసున సముద్రపు జలాలు జల్లి లంకకు రాజుగా ప్రకటిస్తాడు. లక్ష్మయ్యకు అనుమానం పట్టుకుంటుంది.

హఠాత్తుగా మనసుమార్చుకుని రావణుడు కాళ్లబేరానికి వస్తే ఏం చేయాలి? అప్పుడు విభీషణునికి ఏ రాజ్యం కట్టబెట్టాలి? ఇదే సందేహాన్ని అన్నగారి చెవిలో వేస్తాడు. రాముడు క్షణమైనా ఆలోచించడు. విభీషణుడికి అయోధ్య ఇచ్చేసి మాటనిలబెట్టుకుందాం.. అంటాడు. లక్ష్మణుడు సహా అంతా నివ్వెరపోతారు. కన్నీటి తెర కమ్ముకురాగా రాముణ్ణి వేనోళ్ల కీర్తిస్తారు. మాటకు అంతగా కట్టుబడే ధీశాలి ఆయన.

లంకను గెలిచాక లక్ష్మణస్వామికయినా కన్నుచెదిరిందేమో కానీ జగదభిరామునిలో మాత్రం ఏ మార్పూలేదు. స్వర్ణమయమైన లంకను తీసుకుందామా అని లక్ష్మణుడంటే ‘జననీజన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అని తేల్చిచెప్పేస్తాడు. పరుల ధనాన్ని ముట్టనయినా ముట్టని మనోబలం ఆయనకే సొంతం. రాముడు అల్పసంతోషి. నిరాడంబరుడు.

గుణమూ శక్తి రెండూ కలిగినవాడు. శబరి ఎంగిలిపళ్లిస్తే హాయిగా ఆరగిస్తాడు. అందుకు ప్రతిగా ఆమెకు మోక్షమిస్తాడు. ఉడుత బుడత సాయంచేసినా గుర్తుపెట్టుకుంటాడు. దాని వీపు నిమిరి కలకాలం గుర్తులుండిపోయేలా చేసి ఆ రుణం తీర్చుకుంటాడు. రాముడు నిగర్వి. ఏకపత్నీవ్రతుడు. తండ్రికి ముగ్గురు భార్యలున్నారు.

బహుభార్యాత్వం ఆ కాలంలో రాజులకు నిషిద్ధం కాదు. అయినా ఒక మాట ఒక బాణం ఒక పత్ని అనే వ్రతాన్ని నిష్ఠగా పాటిస్తాడు. ప్రజలమాటే వేదంగా రాజ్యాన్ని పాలిస్తాడు. జనావళి ఆజ్ఞనే తలపూవుగా ధరించి జీవితమంతా నడుస్తాడు. చివరికి ప్రజాళి అభిప్రాయాన్ని ఔదలదాల్చినందువల్లనే సీతమ్మవారిని గర్భవతిగా ఉన్నప్పుడు కూడా అరణ్యాలకు అప్పగిస్తాడు. ఇలా ఒకటి కాదు శ్రీరాముని జీవితమంతా సంస్కారపూరితమే. అందుకే ఆయన స్తవనీయుడు. కొడుకుగా, సోదరునిగా, భర్తగా, ప్రభువుగా మానవజాతిని పునీతం చేసిన ఘనత రామునికే దక్కుతుంది.

రాముడు మంచిబాలుడు అనే నానుడి ఉంది. ఇది కొంతవరకే సరైంది. నిజానికి రాముడు మంచిబాలుడే కాకుండా మంచి దేవుడు కూడా. ఇంకా చెప్పాలంటే దేవుళ్లకే దేవుడు. పరిపూర్ణమానవుడు. అందుకే త్రేతాయుగానికి చెందినవాడయినా ఈ కలియుగంలోనూ మన్ననలు పొందుతున్నాడు. అదే రామయ్య ఘనత.

సీతమ్మ తల్లి
సీతమ్మవారు
జన్మస్థలం : మిథిలా నగరం(అయోనిజగా నాగేటి చాలులో దొరుకుతుంది)
తండ్రి : జనకమహీపతి
చెల్లెళ్లు : ఊర్మిళ, మాండవి, శృతకీర్తి
అత్తమామలు: కౌసల్య, దశరథుడు
భర్త : శ్రీరామచంద్రప్రభువు

రామాయణం అంటే రాముని మార్గం. రాముని స్థానం. కానీ వాస్తవంగా మాట్లాడుకోవాల్సివస్తే రామాయణం మొత్తంగా చెప్పేది సీతమ్మ గురించే. దీన్నసలు సీతాయణం అనాలి. ఈ మాట వాల్మీకే చెప్పాడు. ‘ సీతాయాశ్చరితం మహత్’ అని రాశాడు. జానకమ్మది అంతటి సచ్చరిత. ఆమె పాత్ర అంతటి శ్లాఘనీయం. సీతమ్మ అయోనిజ. నాగేటి చాలులో జనకునికి దొరికిన పిల్ల. సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. గుణవతి. రూపవతి.

ఆలోచనాపరురాలు. మానవతకు మరోరూపం. మనోబలమే కాదు ఆమెకున్న శారీరకబలం కూడా తక్కువకాదు. శివధనస్సు పేటికను ఆటలాడుతూ అలవోకగా ముందుకు జరిపి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. మిథిలానగరంలో అప్పట్లో ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుంది. అందుకే ఆ ధనువును ఎక్కుపెట్టినవానికే తన కుమార్తెనిస్తానని జనకుడు ప్రకటిస్తాడు.

పెళ్లయిన కొంతకాలానికే సీతాదేవి భర్తతో పాటు వనాలకు వెళ్లాల్సి వస్తుంది. కైకేయి షరతులు రాములవారికే కానీ సీతకి వర్తించవు. అయితే ఇలాంటి న్యాయమీమాంసలు తీయడానికి సీతమ్మ సగటు మనిషికాదు. భర్త ఎక్కడుంటే అక్కడే తన లోకమని తలచే మహాఇల్లాలు. అతనికంటే ముందుగా నారచీరలు కట్టుకునేందుకు సిద్ధపడుతుంది. రాముడు వద్దని వారిస్తాడు. సీతమ్మ అతణ్ణి వారించి వనవాసానికి బయలుదేరుతుంది.

సీతమ్మవారు సాధ్వీమణి. రాముడికి సైతం కొన్ని విషయాలను చెప్పగలిగేటంతటి యోచనాశక్తి ఆమెకుంది. ఎప్పుడూ చాపబాణాలు ధరిస్తూ తిరక్కుండా, కొంతసేపయినా వాటిని పక్కనబెడితే నష్టమేంటని ఓసారి భర్తనే అడుగుతుంది. కత్తి ఉన్నవాడి చెయ్యి, ధనువు ఉన్నవాడి హస్తం ఊరికే ఉండదని, ఆది హింసనే ప్రేరేపిస్తుందని నొక్కిచెబుతుంది.

ఆయుధాలను ఎల్లప్పుడూ కరానదాల్చడం తగదంటుంది. రాక్షసుల్నయినా చంపడం ఎందుకని ప్రశ్నిస్తుంది. ప్రాణాన్ని ఇవ్వలేనప్పుడు దాన్ని తీయడం ఎంతవరకూ న్యాయమంటుంది. అంత వివేచన ఆమెకుంది. రాముడు కూడా ఆమెను అంతగా గౌరవించడానికి కారణమిదే. మునిపుంగవులను ఇబ్బందులకు గురిచేస్తున్నందువల్లనే దానవులను సంహరిస్తున్నామని రాముడు వివరణ ఇస్తాడు.

రామయ్యకు వనసంచారం కొంతయినా పరిచయం. చిన్నప్పుడే విశ్వామిత్రుడితో కొండల్లో తిరిగాడు. కంటకమార్గాల్లో నడుస్తూ క్లేశాలు భరించాడు. సీతమ్మకి ఇలాంటి కష్టాలు తెలీనే తెలీదు. రాజాన్నభోజనాలు, ఆరామసీమలు, శుకపికాల ఆలాపనలు వీటి మధ్యనే చిన్నప్పటినుంచీ పెరుగుతుంది. అలాంటి అమ్మాయి కర్కశశిలలమీద కటకగమనశ్రమలకోర్చింది.

భర్తను అనుసరించాలన్న సతీధర్మాన్ని ఆమె పాటించినట్టు ఇంకెవరు పాటించలేరేమో. అందుకే లోకపావని ఆనాలంటే సీతామాతనే ముందుగా చెప్పుకోవాలి. సీతమ్మ జనకరాజపుత్రి అయినా జీవితంలో ఆనందపడిందేమీ లేదు. ఎప్పుడైతే మిథిల నుంచి అయోధ్యకు వచ్చిందో అప్పటినుంచీ ఆమెకు కష్టాలు. కన్నీళ్లే. అన్నింటినీ మౌనంగా భరిస్తుంది.

రావణుడు అపహరించుకుపోయాక లంకలో సీతమ్మ పడ్డ చిక్కులు అన్నీ ఇన్నీకావు. పగవారికీ ఇలాంటి ఇక్కట్లు రాకూడదనిపిస్తుంది. రావణుడు పెట్టే బాధలు ఇంతని చెప్పలేం. అశోకవనంలో ఆమె హృదయాన్ని గాయపరిచేవిధంగా రోజూ మాట్లాడుతూనే ఉంటాడు. మాయా రాముడి తలనరికి వికటాట్టహాసాలు చేస్తాడు. ఇదంతా నిజమో కాదో తెలీక అమ్మవారు తల్లడిల్లిపోతుంటుంది. ఆమె ఎంతటి గుణశీలి అంటే రావణుడు ఎదురుపడినప్పుడల్లా గడ్డిపరకను అడ్డుపెట్టుకుని మాట్లాడుతుంది. పరపురుషుడి నీడ తనమీద పడకూడదన్న పాతివ్రత్యధర్మానికి కట్టుబడి ఉంటుంది.

ఆంజనేయుడు స్వయంగా తన భుజాలమీద తరలించుకుపోతానని, రాముని వద్దకు చేరుస్తానని సీతమ్మకు చెప్పినా ఆమె అంగీకరించదు. ఎవరో తీసుకువస్తేనే రాగలిగిందన్న నిందకు భర్తను గురికాకుండా చూస్తుంది. రామునితోనే అయోధ్యలో పాదం మోపుతానని తన నిర్ణయాన్ని చెబుతుంది. నేలతల్లి కూతురామె. అందుకేనేమో భూమాతకున్న సహనం ఆమెకు అబ్బింది.
రామరావణ యుద్ధం ముగిసాక అంతా సుఖాంతమైందని భావిస్తున్న తరుణంలో ఆమె అగ్నిప్రవేశం చేయాల్సి వస్తుంది. ఇదెంత బాధాకరమో. రాముడు వాచ్యంగా అగ్నిలో దూకమని ఆమెకు చెప్పడు. దృష్టి దోషం ఉన్నవాడికి కనిపించినట్టుగా తనకు సీత దీపంలా కనిపిస్తోందని మాత్రమే అంటాడు. లోపమేదో ఆయన దృష్టిలోనే ఉందన్నట్టుగా భర్త మాట్లాడుతున్నప్పుడు తను దీపమని నిరూపించుకుని తీరాలి. అలా నిరూపించుకునేందుకే సీతమ్మ అగ్నిలో దూకుతుంది. హుతవాహుడు చల్లబడి ఆమెను మల్లెపూవులా పైకి తీసుకువస్తాడు. ఆమె అంతటి స్వాభిమాని.

అయోధ్యకి మరలివెళ్లాక కూడా ఆమె సుఖంగా ఉన్నది కొంతకాలమే. గర్భవతిగా ఉన్న ఆమెను మళ్లీ కాకులు దూరని కానలకు పంపిస్తాడు రాముడు. జనవాక్యం ప్రభువుకు కర్తవ్యం అనే విధానానికి లోబడి ఆ పనిచేస్తాడు. లవకుశులకు జన్మనిచ్చి వంశాన్ని కాపాడి తాను భూమిలో కలిసిపోతుంది సీతమ్మ. కర్తవ్యపాలనలో రఘరామునికి తోడుపడేందుకే ఆమె ఈ భూమ్మీదికి వచ్చిందనిపిస్తుంది. పట్టమహిషిగా పట్టుపాన్పులమీద పవళించినా, ఆశ్రమవాసంలో దర్భశయ్యమీద నడుంవాల్చినా భర్తపక్కనుంటే అదే పదివేలనుకుంటుంది.

కమ్మని భక్ష్యభోజ్యాలకంటే పెనిమిటితో కలిసి ఆకులు అలమలు తిన్నా అదే హితమని ఆచరణలో చూపుతుంది. ధర్మమంటే ఏంటో చెప్పడం కాదు. దాన్ని తన నడవడిక ద్వారా వెల్లడిచేసి ఘనకీర్తి పొందిన తల్లి సీతమ్మవారు. అందుకే రామచంద్రునికి సీత అంటే అంత ప్రేమ. సీతలేని రాముడు దీనుడు. సీతలేని రాముడు బలహీనుడు. సీతలేనిదే రాముడు లేడు. అందుకే సీతాదేవితో కలిసి ఉంటేనే రాముడు పూజలందుకునే అర్చామూర్తి అవుతాడు.

రామ అంటే రాముడు. రామా అని దీర్ఘం తీస్తే సీతమ్మ. చిన్న దీర్ఘమే సీతను రామయ్యలో లీనం చేసింది. వారిద్దరూ వేరువేరు కాదని ఒకే రూపమని నిరూపించింది. సీతమ్మ అచ్చమైన నవమి చిలుక. స్వధర్మానికి సిసలైన ప్రతీక.

;;